October 10, 2009

పెద్దోళ్ళు - గట్టోళ్ళు

మనం ఎప్పుడూ పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని చాదస్తపరులు అనుకుంటూ ఉంటాం. వాళ్ళని విసుక్కునే, తిట్టుకునే సందర్భాలూ ఉంటూనే ఉంటాయి. కానీ, వాళ్ళ మాటల్లో ఒక రకమైన వినోదం ఉంటుంది. వినోదం అంటే ఇక్కడ మీరు మరొకలాగా భావించొద్దు. ఆ చాదస్తం లో వ్యంగ్యం, అమాయకత్వం, కోపం, అసహనం లాంటివి సమపాళ్ళలో ఇమిడి ఉంటాయి. వారి మాటలు అప్పుడప్పుడూ చాలా సరదాగా, నవ్వు తెప్పించేవిగా, పలు సందర్భాల్లో ఎంతో చమత్కారంగా కూడా ఉంటాయి. దీనినే ఆంగ్లం లో Pun అంటారు.

ఋతువులు ఆరు అని మనకి తెలుసు. కానీ ఈ మధ్యనే కొత్త ఋతువు ఒకటి ప్రపంచ వ్యాప్తంగా వాడుకలోకి వచ్చింది- ఐపిఎల్ ఋతువు - అదేనండీ, క్రికెట్. చాలామంది పెద్దవాళ్ళకి క్రికెట్ అంటే అస్సలు గిట్టదు. మా తాతగారు, కీ.శే. శ్రీ దశిక భాస్కర రామ్మూర్తిగారు ఇలాంటి కోవకు చెందిన వారు. ఆయన పైకి ఎంత గంభీరంగా కనిపించేవారో అంత సరదా మనిషి. టీ.వీ. లో క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నంతసేపూ ఎదో ఒకటి అంటూనే వుండేవారు.

ఒక సారి మన భారత జట్టు వేరే దేశంతో ఆడుతోంది. మన బౌలింగ్ లో వాళ్ళ సారథి సిక్స్ కొట్టాడు. అప్పుడు మా తాతగారు, "ఛి ఛి, ఏవిటా బంతి? లడ్డూ తీసుకెళ్ళి చేతికిచ్చినట్టు ఇచ్చాడు." అని వ్యాఖ్యానించారు. ఆ మరుసటి ఓవర్ లో ఒక ప్రముఖ ఆల్ రౌండర్ క్యాచ్ వదిలేసినప్పుడు, "గుడ్డి వెధవ లాగా ఆ నల్ల కళ్ళద్దాలూ వాడూ!" అని అన్నారు. ఇలా అలోచిస్తుంటే మరొక సరదా సంఘటన గుర్తుకొస్తోంది.

ప్రముఖ ఆలయాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటునుండి ఇలా దర్శనానికి వెళ్ళామో లేదో, అటునుండి అలా బయటకి లాగేస్తూంటారు. ఒకసారి మేము స్వామి వారి దర్శనం కోసం యాదగిరిగుట్ట వెళ్ళాము. వేసవి సెలవలు కావడంతో చాలా రద్దీగా ఉంది. గంటకు పైనే క్యూలో నిలబడి గర్భ గుడి లోనికి ప్రవేశించాము. షరా మామూలే అన్నట్టు, అక్కడ కూడా కొంతమంది భక్తులని బయటకి లాగడం, తొయ్యడం చేస్తున్నారు. దండం పెట్టుకుంటున్న మా తాతగారిని ఒక వ్యక్తి, "ఎంతసేపండీ? వెళ్ళండి వెళ్ళండి!” అన్నాడు. దానికి జవాబుగా ఆయన “ఏవిటయ్యా, దండంపెట్టుకుందామని విగ్రహంకేసి చూసినప్పుడల్లా మొహం తిప్పేస్తుంటే ఎలా?" అంటూ చమత్కరించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో! మనం అనుకుంటాము కానీ ముసలివాళ్ళు మాటలు ఎంత కఠినంగా పలికినా అందులో ఆప్యాయత, ప్రేమ మాత్రం లేకుండా పోవు. మరి ఈ సారి వాళ్ళని విసుక్కునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారుగా?


This essay was published in an Australian based Telugu magazine in May 2009