March 23, 2009

రండి వోటు వేద్దాం


హలో.. మీరు వోటు వేస్తారా?
“వోటా..!! ఏమో వెయ్యకపోవచ్చు. “
అదే?
“అవును మరి! ప్రతి పార్టీ తమ అజెండా తో ప్రచారం మొదలుపెట్టింది. కానీ, ఆ అజెండా లో నాకేముంది? నాకు ఉచిత కరెంటు రాదు.. కలర్ టీ.వీ. రాదు.. నెల నెలా సొమ్ము ముట్టదు.. పొనీ కనీసం ఉన్న ఉద్యోగం ఊడదన్న నమ్మకం ఉందా అంటే, అదీ లేదు. ఇప్పుడు చెప్పండి నేను వోటు ఎందుకు వెయ్యాలి? ఎవరికోసం వెయ్యాలి?”

ఎక్ష్క్యూజ్ మీ... మీరు వోటు వేస్తారా?
“వెయ్యాలనే ఉందండి. కానీ, ఎవరికి వెయ్యాలి? ఎలా వెయ్యాలి.. ఇదేదో పెద్ద పని లా ఉందే!”
అదేంటి? మీకు అందుబాట్లో చాలానే పార్టీలున్నాయి గా, మీరు చెయ్యాల్సినదంతా మీ పేరు వోటరు లిస్ట్ లో నమోదు చేయించుకుని నచ్చిన గుర్తు కి వోటు వెయ్యడం. అంతే.
“… సరే చూస్తా!”

హలో, ఒక్క నిమిషం... మీరు ఈసారి వోటు వేస్తారా?
“తప్పకుండా. కానీ, ఎవరికి వెయ్యాలో తెలీట్లేదు.“
తెలీట్లేదా? విచిత్రంగా ఉందే!
“లేక పోతే ఏంటండీ? అసలు ఎవరికి వోటు వెయ్యాలో మీకు ఖచ్చితంగా తెలుసా? ఏ పార్టీ గెలుస్తే న్యాయంగా, నమ్మకంగా పరిపాలిస్తుందో చెప్పండి, వేస్తా. 'వోటు వెయ్యండి. అది మీ హక్కు ' అని బాధ్యత గల పౌరులు అంటుంటే, ఆ వోటు మాకు వెయ్యండి.. మీ సొంతానికి ఈ లాభాలు పొందండి అని పార్టీలు సిగ్గు విడిచి బహిరంగ ప్రచారాలు చేస్తున్నాయి. నాకు నా సొంతానికి ఎదీ వద్దు. కానీ నా దేశం అవినీతి-అక్రమాలు, కుళ్ళు రాజకీయాల నుండి విముక్తి పొందే ఆ రోజు కోసం ఎదురుచూస్తూన్నా. చూస్తూనే ఉంటా. ఇప్పుడు చెప్పండి నన్ను ఎవరికి వోటు వెయ్యమంటారో!”

ఈ సంభాషణలు చదివారు గా! మనకి మొదటి రెండు రకాల మనుషులు కనిపిస్తూనే ఉంటారు. మనలో చాలా మంది ఈ కోవకి చెందినవారే. మూడో రకం వాళ్ళు కాస్త అరుదు గా తారసపడినా, కొద్ది శాతం వీళ్ళూ లేకుండా పోలేదు. వోటు వెయ్యడం మన హక్కే కాదు, అది మన బాధ్యత కూడా. ఈ కాలం లో చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ విషయం అనుక్షణం గుర్తుచెయ్యాల్సి రావడం చాలా దురద్రుష్టకరం. మీ ఒక్క వోటు దేశాన్ని మార్చలేకపోవచ్చు కానీ, మన అందరం కలిస్తే ఇది తప్పకుండా ఎప్పడికయినా సాధ్యపడే విషయం.

రండి వోటు వేద్దాం. ఒక్కటవుదాం.

2 comments:

  1. looks interesting

    ReplyDelete
  2. Hi,

    We made a Viral PPT on why one should vote for Loksatta and the main
    difference between Loksatta and other parties.

    You can find it from the below link

    http://www.slideshare.net/indizen

    Can you plz help us in spreading the word.

    Do let me know your thoughts and feedback on the ppt

    ReplyDelete